నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన రుద్రారపు కావేరి కఠినమైన యోగాసనాలు అవలీలగా వేస్తూ ఔరా..! అనిపిస్తోంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి మూడో ఏట నుంచే యోగాపై ఆసక్తి పెంచుకుంది. యోగా శిక్షకుడిగా పనిచేస్తున్న తండ్రి మల్లేష్ కూతురులోని పట్టుదలకు మెరుగులద్ది అంతర్జాతీయ స్థాయిలో తురుపుముక్కలా తీర్చిదిద్దాడు.
అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి
కావేరి తన ప్రతిభతో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. 2016-17లో రెండు సార్లు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. గతేడాది అక్టోబరులో కర్ణాటక దావనగిరిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. ఆ విజయంతో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. తండ్రి ప్రోత్సాహం, శిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నానంటోంది కావేరి.