నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండా తండాకు చెందిన రమావత్ సువర్ణ (24) చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడింది. కాళ్లు, చేతులు కదపలేని సువర్ణ.. ఏ పని చేయాలన్నా.. ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే! అయినా ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఎవర్నీ కష్టపెట్టకుండా జీవించాలనుకుంది.
మూడేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. పనికెళితేనే పూట గడిచేది. అయినప్పటికీ బిడ్డను అలా వదిలెళ్లలేక.. ఇంటివద్దే ఉంటూ చూసుకునే వారు. ఆ సమయలో కుటుంబ పోషణ మరింత భారమైంది.
తల్లిదండ్రులకు భారం కావొద్దని భావించిన సువర్ణ.. బొమ్మలపై శ్రద్ధ పెట్టింది. చేతులు కదలకున్నా వేళ్ల సాయంతో చిన్నచిన్న బొమ్మలు గీస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. చిత్రాలతో వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తోంది.