RSS Hindu Shakti Sangamam: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హిందూ శక్తి సంగమం జిల్లా మహా సాంఘిక్ సార్వజనిక ఉత్సవాన్నీ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ హిందు శక్తి సంగమంలో జిల్లాలోని సుమారు 5వేల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్వయం సేవకులు ర్యాలీగా ఎన్జీ కళాశాలలోని మైదానానికి తరలివచ్చారు. మైదానంలో కొద్దిసేపు వ్యాయామ ప్రదర్శన చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో ప్రార్థన చేసి కాషాయం జెండా ఎగురవేశారు. విదేశీయుల నుంచి స్వాతంత్య్రం సాధించుకుని 75 ఏళ్లు అవుతున్నా ఇంకా వెనుకబాటుకు కారణం సరైన విద్య అందకపోవడమేనని ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. జాతీయ భావజాలంతో అందరూ ఐక్యంగా ఉండి పని చేస్తే అభివృద్ధి సాధ్యమని జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు నిరూపించాయని ఆయన అన్నారు.
వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోయి ఇతరులను అనుకరించడం వల్ల భారత సంస్కృతి నీరిగారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో అవినీతి, అధికారం కోసం పాకులాడటం తప్ప ప్రజల కోసం చేసిందేమి లేదన్నారు. భారత్ విశ్వగురువుగా ఎదగాలంటే మనవాళ్లు అన్ని రంగాల్లో అందిపుచ్చుకోవాలన్నారు. 195 దేశాల్లో భారత యోగా వైద్య విధానం అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఆత్మ నిర్భరంతో నిలబడి అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారత్ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. కరోనా సమయంలో భారత్ వ్యాక్సిన్ తయారు చేస్తోందంటే ఎవరూ నమ్మలేదని.. కానీ తయారు చేశాక టీకాలను కొనుగోలు చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు.