నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం(Venkatadri palem) శివారులో ఉన్న ప్రాంతంలో 7.24 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి విషయంలో జరిగిన అక్రమాలు చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూలో కిందిస్థాయి సిబ్బంది పెట్టిన మెలికతో భూతగాదాలు మరింత పెరిగిపోతూ ఉండగా.. ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. మిర్యాలగూడలో భారత ఆహార(FCI) గోదాముల కార్యాలయాలు 1965లో ఏర్పాటు చేయడంతోనే దీనికి ఎదురుగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. సర్వే నెంబర్ 79లో ఉన్న 7.24 ఎకరాల భూమిని సజ్జల పుల్లారెడ్డి అనే వ్యక్తి పరిమి వీరభద్రరావుకు 1971లో విక్రయించారు. ఆయన వీటిని ఇళ్ల స్థలాలుగా మార్చి పలువురికి విక్రయాలు జరిపారు. ఈ ప్రాంతంలో వందలాదిగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. రెవెన్యూ రికార్డుల్లో సైతం 1983 పహానీలో వీరభద్రరావు పేరిట నమోదయ్యాయి.
మళ్లీ వారి పేరు మీదనే
మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం నూతన పట్టాదారు పాసు పుస్తకాలు(Pass Books) మంజూరు చేసిన సమయంలో రెవెన్యూ(Revenue) సిబ్బంది లాలూచీపడి 7.26 ఎకరాల విస్తీర్ణం గల భూమిని సజ్జల పుల్లారెడ్డి కుమారుడు, సోదరుడికి ఒక్కొక్కరికి 1.36 ఎకరాల చొప్పున పేర్లు నమోదు చేస్తూ పాసుపుస్తకాలు అందించారు. ఈ నూతన పాసు పుస్తకాలకు రైతుబంధు నిధులు ఖరీఫ్, రబీ కాలాల్లో యజమానుల ఖాతాలో జమ చేస్తున్నారు. నూతన పాసుపుస్తకాలు మంజూరు కాగానే సదరు వ్యక్తులు తమ భూములు ఉన్నాయంటూ స్థానికంగా ఉన్న ఖాళీ ప్లాట్ల యజమానుల వద్దకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు.
2018లో వీరభద్రరావు వద్ద నుంచి 15గుంటల భూమి కొనుగోలు చేశాం. ఆ భూమిని గోదాముకు లీజు ఇచ్చాం. 1971లో సజ్జల పుల్లారెడ్డి.. వీరభద్రరావుకు సర్వే నెంబరు 79 భూమిని విక్రయించారు. ఆయన ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇప్పుడు వాళ్లు మళ్లీ ఈ భూమి మీద పట్టా పుస్తకాలు చూపించి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. -పప్పుల వెంకట్ రెడ్డి, బాధితుడు