munugodu by elections: మునుగోడు రాజకీయం క్షేత్రస్థాయికి చేరింది. అన్ని పార్టీలు ఉప ఎన్నికల పోరును కార్యక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అమిత్‌షా సభకు ముందుగానే మునుగోడు కేంద్రంగా ఈ నెల 20న తెరాస సీఎం కేసీఆర్ సభకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణతో సభ నిర్వహించాలని పార్టీ ముఖ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే అసమ్మతి నేతలతో చర్చించిన పార్టీ నేతలు, సీఎం కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని తీర్మానించారు. అప్పటివరకు పార్టీయే అభ్యర్థిగా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఉప ఎన్నిక, వివిధ పరిణామాలపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లో సుదీర్ఘంగా చర్చించి వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపు రేవంత్ పాదయాత్ర:సంస్థాన్ నారాయణ్‌పూర్ నుంచి చౌటుప్పల్ వరకు యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రేపు (13వ తేదీ శనివారం) చేసే పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు రోజూ రెండు మండలాల చొప్పున ముఖ్య కార్యకర్తలు, నేతలతో సమావేశమై ఉప ఎన్నికలపై వారు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం తుది దశకు చేరుకుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీలను ప్రకటించనున్నారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి నేతలంతా నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొనాలని పీసీసీ పిలుపునిచ్చింది. తెరాస, భాజపా సభల అనంతరం అవసరమైతే మునుగోడులోనే సభ నిర్వహించాలని కొంత మంది నేతలు పీసీసీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేయగా... 21 తర్వాత దీనిపై పీసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.