పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్‌కు నిరసన సెగ తగులుతోంది. రాజ్ భవన్ ముట్టడికి రాష్ట్రం నలుమూలల నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని ఇళ్ల వద్దనే హౌస్ అరెస్టులు, అరెస్టులు చేస్తున్నారు.
రాజధానిలో
హైదరాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసారు. మేడ్చల్‌లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేగు రాజును ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చని గతంలోనే హైకోర్టు అనుమతిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడంపై రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోదాడలో
రాజ్‌భవన్ ముట్టడికి సూర్యాపేట జిల్లా నుంచి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్ నాయకులను కోదాడ పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పెంచిన చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులను రాజ్ భవన్‌కు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు.