నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి ఆయన.. ఎన్నో తర్జనభర్జనల అనంతరం పార్టీ అధిష్ఠానం మరొకరికి టికెట్ కేటాయించింది. అప్పటినుంచి ఆ నాయకుడు అంటీముట్టనట్లుగా ఉంటున్నాడు. తనకున్న అసంతృప్తి కారణంగా ఇతర పార్టీకి చెందిన నాయకుడికి సహకరించేందుకు సిద్ధమయ్యాడు.
ఏకంగా ప్రత్యర్థి పార్టీ రాష్ట్ర నేతతో ఫోన్లో మాట్లాడారు. ఇది జరిగిన కాసేపటికే ఇలాంటివి మానుకోవాలని సొంతపార్టీ నుంచి ఆ నేతకు ఫోన్ వచ్చింది. ఇష్టం లేకపోయినా అసంతృప్త నాయకులకు సొంత పార్టీ నేతలతో తిరగక తప్పడం లేదు. ఇలాంటి ఉదాహరణలే ఉప ఎన్నికల్లో సాక్షాత్కరిస్తున్నాయి.
ఓట్లు చేజారకుండా దృష్టి...
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్న పార్టీలు... అంతకుమించి తమ ఓట్లు చేజారకుండా దృష్టిపెట్టాయి. పార్టీలోని అసంతృప్తవాదుల నుంచి ఓటర్లు చేజారకుండా నిరంతర నిఘా పెట్టాయి. అడుగు తీసి అడుగు వేస్తే ఏం చేస్తున్నారనేది... నిమిషాల్లో సొంత పార్టీ నేతలకు తెలిసిపోతోంది.
నిఘా...
మూడు ప్రధాన పార్టీల్లో ప్రచారంలో అన్నింటికన్నా ముందున్న పార్టీ అయితే అన్ని రకాల నిఘాను అసంతృప్త వాదులపై ఉంచింది. ఎవరెవరు ఏం చేస్తున్నారు... ప్రచారంలో సహకరిస్తున్నారా? తమ పార్టీకి ఓట్లు వేసేందుకు క్షేత్రస్థాయి శ్రేణులతో సమన్వయం చేస్తున్నారా? లేదా అనే కోణంలో సదరు నేతల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.