IKP Centres in Telangana: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు మొదలుపెడుతున్నారు. నల్గొండ సమీపంలోని అర్జాలబావి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. రైతులు వడ్లను ఆరబెట్టి 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్లే అన్నదాతల కష్టాలను చూసి... ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేంద్రం మొండిచేయి చూపినా రాష్ట్రప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు.
"ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని.. వీలైనంత మేర సాయం చేసేందుకు ప్రయత్నించాలి. మీ చేతకానితనాన్ని.. మేమే మెడలు వంచి వడ్లు కొనేలా చేస్తున్నామని చెప్పడం ప్రతిపక్షాలకు సరికాదు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని.. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్నారు." -గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్
అప్పు లేని రైతును చుడాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోచారం ప్రారంభించారు. పాదయాత్రల పేరుతో తిరుగుతున్న నాయకుడు ఒక్కరోజైనా తెలంగాణ రైతుల వడ్లు కొనాలని పార్లమెంట్‌లో మాట్లాడారా అని ప్రశ్నించారు.
"రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అన్నీ అమలు చేస్తున్నాం. కానీ విమర్శలు చేస్తున్న నాయకులు.. వారు పాలిస్తున్న ప్రాంతాల్లో ఇవన్నీ అమలు చేస్తున్నారా.? ఒక్కసారైనా రైతుల గురించి పార్లమెంటులో మాట్లాడారా.?" -పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ సభాపతి