పచ్చదనం పెంపొందించడానికి మొక్కల సంరక్షణే ప్రథమ కర్తవ్యం. అయితే నర్సరీలు ఎక్కువగా ప్రైవేటు భూముల్లో ఉంటాయి. వీటిలో రక్షణాత్మక చర్యలు కొరవడటం వల్ల.. సగం మొక్కలు కూడా బతకడం లేదు. ప్రభుత్వ సిబ్బందే ఈ సంరక్షణ పద్ధతులు అవలంబిస్తే.. ఒక్క మొక్కా వృథా కాదనే ఆలోచనతో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలు ఏర్పాటు చేస్తూ మొక్కలు సంరక్షిస్తున్నారు. గ్రామ కంఠం, లేఅవుట్లలో కేటాయించిన 10 శాతం జాగాలు, పల్లె ప్రకృతి వనాలు, బడులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇందుకు ఉపయోగిస్తున్నారు.
సర్కారు భూముల్లోనే...
ఇప్పటివరకూ గ్రామ పంచాయతీ ఆధారంగా సంరక్షణ కేంద్రాలు ఉండగా.. అనుబంధ గ్రామాల్లోకి మొక్కల్ని చేరవేసేవారు. దీనివల్ల వంద మొక్కలు తరలిస్తే అందులో 30 నుంచి 40 వరకు దక్కకుండా పోతున్నట్లు గుర్తించారు. పల్లెల్లోనే ప్రభుత్వ భూముల్లో చేపట్టే నర్సరీల ద్వారా వృథా తగ్గే అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ కింద ఒక్కో నర్సరీకి 45వేలు నిధులు వస్తుండటంతో.. సంరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించే వీలుంటోంది.