నాగార్జునసాగర్ పోరు కీలక ఘట్టానికి చేరుకుంది. కొవిడ్ నిబంధనల మధ్య సాగర్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్లు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించేలా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 346 ఓటింగ్ కేంద్రాల్లో 3వేల 145 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు.
కీలక ఘట్టానికి సాగర్ పోరు.. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 3వేల 145 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. కరోనా దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. 2 లక్షల 20 వేల 3 వందల మంది ఓటర్లున్న నియోజకవర్గంలో... లక్షా 9 వేల 228 మంది పురుషులు, లక్షా 11 వేల 72 మంది మహిళలున్నారు. మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా... తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, భాజపా తరఫున రవికుమార్ బరిలో ఉన్నారు. మే 2న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
మరోవైపు ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట సెగ్మెంట్లలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున... మొత్తం 2 వేల 470 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు... మే రెండో తేదీన జరగనుంది.
- ఇదీ చదవండి :ఆక్సిజన్, ఐసీయూ పడకల లేమి.. కరోనా రోగుల విలవిల