Munugode Bypoll: మునుగోడు ఉపపోరులో పార్టీల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్‌కు పదిరోజులు గడువే ఉండడంతో... నేతలంతా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పల్లెపల్లెన మోహరించిన నేతలు... ఇంటింటి ప్రచారం సాగిస్తుండగా రాష్ట్రస్థాయి నాయకత్వం గెలుపుకోసం సామాజికవర్గాల వారీగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కూసుకుంట్లను గెలిపించాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థికి కోమటిరెడ్డికి ఓటేయాలంటూ కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్ అభ్యర్థిస్తున్నారు. పాల్వాయి స్రవంతికి పట్టం కట్టాలంటూ స్థానిక నేతలతో పాటు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.
మునుగోడు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా చండూరు మండలం శిర్ధేపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. మహిళలు కోలాటం వేస్తూ బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. గల్లీగల్లీలో తిరుగుతూ తెరాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. చండూర్ మండలం ఉడుతాలపల్లి, పడమటితాళ్ల, కాస్తాల, శిర్దేపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. రాజగోపాల్‌రెడ్డి ఏనాడు కూడా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... భాజపా గెలుపు ఖాయం.. మునుగోడు ఉపఎన్నిక న్యాయానికి-అన్యాయానికి, ధర్మానికి-అధర్మానికి మధ్య జరుగుతోందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం రతిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మద్యం, మాంసం, మనీ అక్రమంగా పంచుతూ ఎలాగైనా గెలవాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. తెరాస సర్కార్ తప్పుడు విధానాల ద్వారా మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం అప్పులపాలైందని మండిపడ్డారు. మునుగోడు ఓటర్లను తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... భాజపా గెలుపు ఖాయమని... సర్వేలు అదే చెబుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాగోల్‌లో మునుగోడు ఓటర్లతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుందని... రాత్రికి రాత్రి రోడ్లు వేశారని నేతలు స్పష్టం చేశారు.