తెలంగాణ

telangana

ETV Bharat / state

Munugode Bypoll Arrangements: మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం..! - Munugode Bypoll campaign

Munugode Bypoll Arrangements: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్​ కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో పాటు ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గంలో గత అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భద్రతాదళాలు ఏర్పాటు చేసిన ఈసీ.. పోలింగ్​ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టింది. నగదు, మద్యం పంపిణీ కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తోంది.

మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

By

Published : Nov 1, 2022, 4:59 PM IST

Munugode Bypoll Arrangements: ఈ నెల 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచార ఘట్టం ముగియడంతో పోలింగ్​ ఏర్పాట్లను ఈసీ వేగవంతం చేసింది. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లుండగా.. ఇందులో లక్షా 21,672 మంది పురుషులు.. లక్షా 20వేల 126 మంది మహిళలు.. ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఉప ఎన్నికకు 119 కేంద్రాల్లోని 298 పోలింగ్​ బూతులు ఏర్పాటు చేయగా.. అర్బన్​ పరిధిలో 35, రూరల్​ పరిధిలో 263 పోలింగ్​ కేంద్రాలున్నాయి.

ఈసారి తొలిసారి ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తుండగా.. ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తైంది. ఆన్​లైన్​లోనూ ఈ స్లిప్​లను అందుబాటులో ఉంచారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో షామియానాలతో పాటు వృద్ధులకు వీల్​ ఛైర్లనూ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటిని సమకూరుస్తున్నారు. సాయంత్రం 6 గంటల లోపల కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓటరు.. ఎంత రాత్రైనా ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టారు.

నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. అదే రోజు ఉదయం ఐదున్నర గంటలకు మాక్​ పోలింగ్​ ప్రారంభమవుతుంది. అన్ని కేంద్రాలకు పంపిణీ చేయడానికి 1192 ఈవీఎంలు, 596 వీవీప్యాట్లు, 596 కంట్రోల్​ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీర్లను సైతం అందుబాటులో ఉంచారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఈవీఎంల ర్యాండమైజేషన్​ ప్రక్రియ పూర్తయింది.

ఎన్నికల నిర్వహణకు 373 మంది పీవో, 373 మంది ఏపీవో, 740 జీపీవోలతో పాటు సుమారు రెండు వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. నోడల్ అధికారులు 16 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ పోలింగ్​రోజు, అంతకుముందు రోజు రాత్రి ఆయా కేంద్రాల్లో వసతులకు ఇబ్బందుల్లేకుండా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు పూర్తి చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్​ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదు చేయనున్నారు.

కేంద్రబలగాలతో పహారా: మద్యం, నగదు పంపిణీ విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 3,366 మంది రాష్ట్ర పోలీసులు.. 15 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. నియోజకవర్గానికి వచ్చే అన్నిదారుల్లో చెక్​పోస్టులను ఏర్పాటు చేసి.. క్షుణ్నంగా తనిఖీలు జరుపుతున్నారు.

నియోజకవర్గంలోని 49 ప్రాంతాల్లో 105 సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. పోలీసు యంత్రాంగంతో కలిసి ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యాధునిక కెమెరాలతో చెక్​పోస్టులు, సర్వైలెన్స్ టీమ్​లు పర్యవేక్షిస్తున్నాయి. ఇక్కడ తీసిన వీడియో నేరుగా నల్గొండ కలెక్టరేట్​లోని కంట్రోల్​ రూమ్​లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీంతో ఎక్కడా అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు. తహసీల్దార్, నాయబ్​ తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, జనరల్​ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇవీ చూడండి..

'ప్రలోభాలకు ఆస్కారం ఉండొద్దు.. అభ్యర్థుల వ్యయంపై నిఘా ఉంచండి'

'ఆమ్​ ఆద్మీకి భారీగా ముడిపులిచ్చా'.. సుకేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు

ABOUT THE AUTHOR

...view details