పోతిరెడ్డిపాడు నుంచి క్రమ క్రమంగా 88 వేల క్యూసెక్కుల నీళ్లను సంగమేశ్వరం లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. 203 జీవోను తీసుకొచ్చి దాదాపు పది రోజులైనా ఇప్పటివరకు దానిపై స్పందించలేదని విమర్శించారు.
"డిండీ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడే.. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 90 శాతం పూర్తి చేశారు. డిండీ ప్రాజెక్టు మాత్రం 9 శాతం మాత్రమే ఎందుకు పూర్తయ్యింది. దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వమే బత్తాయి పంటను టన్నుకు 25 వేల నుంచి 30 వేల వరకు కొనుగోలు చేస్తుంది. మన రాష్ట్రంలో బత్తాయి ఎందుకు కొనుగోలు చేసుకోలేదు. ఈ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైంది."
-కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భువనగిరి ఎంపీ
తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా స్పష్టంగా పోతిరెడ్డిపాడుపై తమ వైఖరిని చెప్పామని.. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెరాస అనేక పోరాటాలు చేసిందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. 2001 నుంచి 2014 వరకు సందర్భం వచ్చినప్పుడల్లా నదీజలాల్లో తెలంగాణ వాటా కోసం చాలా స్పష్టంగా కొట్లాడంమన్నారు.