Double bedroom houses issue in Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో పేదల కోసం వెంకటాద్రిపాలెం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద 560 రెండు పడకల గదులను ప్రభుత్వం నిర్మించింది. పట్టణంలోని 48 వార్డుల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. సర్వే జరిపి అర్హుల జాబితాను రూపొందించారు. జాబితాలో అనేక అవకతవకలు జరగాయని వార్డుల్లోని ఆశావహులు ఆందోళనకు దిగారు. అధికారులు పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాతే డ్రా తీస్తామని చెప్పి మాకు అన్యాయం చేశారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు.
రెండు పడకల జాబితాల్లో తప్పులు: అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలతో పాటు అధికార పక్ష నేతలు గొంతు కలిపి ఆందోళనకు దిగడంతో అధికార యంత్రాంగం విస్తుపోయింది. ఇళ్ల పంపిణీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని లబ్ధిదారులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో రెండు పడక గదుల ఇళ్ల అర్హుల జాబితాను తప్పుల తడకగా రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.
కౌన్సిలర్‌పై దాడి: 29వ వార్డులో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. మూడో వార్డు తాళ్లగడ్డలో ఇల్లు కేటాయించలేదని స్థానిక యువకులు కౌన్సిలర్ బంటు రమేశ్‌పై దాడి చేసి గాయపరిచారు. 39వ వార్డు అశోక్ నగర్లో స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ తమ వార్డులో డ్రా కార్యక్రమాన్ని బహిష్కరించారు.