తెరాస మంత్రులు ఇతర పార్టీ వాళ్లను చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల అభివృద్ధిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. మునుగోడులో దళితబంధు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
మునుగోడు అభివృద్ధిని మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇతర మంత్రులు కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి పట్టడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన ఓటమికి కృషి చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి సహకారం ఇవ్వకపోయినా కరోనా విపత్కర పరిస్థితుల్లో ఐదు కోట్ల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను తెరాసలో చేర్పించుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.