దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో వచ్చిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తెరాస తరఫున బరిలో నిలిచిన నోముల తనయుడు భగత్... విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. త్రిపురారం మండలం సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో రోడ్‌షో నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని... ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తన తండ్రి ఆశయాలు సాధించడం కోసం తనకు అవకాశం ఇవ్వాలని భగత్ ఓటర్లను అభ్యర్థించారు. ఉపఎన్నికకు సంబంధించి తెరాస ఇంఛార్జ్‌లు, ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమష్టిగా కృషి చేసి... సాగర్‌ను మళ్లీ నిలబెట్టుకుందామని నేతలు సూచించారు.
కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన సీనియర్ నేత జానారెడ్డి... తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హాలియా పురపాలిరక పరిధిలో పలువురు తెరాస నాయకులు..కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువా కప్పిన జానారెడ్డి... పార్టీలోకి ఆహ్వానించారు. తన హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి.... ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని జానారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.