నల్గొండ జిల్లా మునుగోడులో రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో తన నివాసంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ మారే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. త్వరలోనే భాజపాలో చేరడం ఖాయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలా ? వద్దా ? అనే విషయం ప్రత్యేక సర్వే చేయించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి సర్వే ఫలితాలు రావడానికి వారం పది రోజుల పడుతుందని.. ఆ తర్వాతే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు పేర్కొన్నారు.
కేసీఆర్‌ను దెబ్బతీయాలంటే కాంగ్రెస్ వల్ల కాదని.. భాజపానే సరైన ప్రత్యామ్నాయమని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తనపై నమ్మకంతో వెంట వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో భాజపా బలంగా లేదనేది వాస్తవం కాదని.. గతంలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉండేదని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. కేసీఆర్‌ను ఎదురించే దమ్ము తనకే ఉందని గుర్తించి మోదీ, అమిత్‌షాలు స్వయంగా భాజపాలోకి ఆహ్వానించారని పేర్కొన్నట్లు వివరించారు. కొంత మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లోనే ఉండి తెరాసపై పోరాడాలని వెల్లడించగా.. మరికొందరు మద్దతిస్తామని ప్రకటించినట్లు సమాచారం.