మరోసారి ఆందోళన బాటపట్టిన కిష్టరాయిన్‌పల్లి జలాశయం నిర్వాసితులు నల్గొండ జిల్లా (nalgonda district) కిష్టరాయిన్‌పల్లి జలాశయం నిర్వాసితులు మరోసారి ఆందోళన బాటపట్టారు (kishtarayanapalli reservoir residents). పరిహారం చెల్లించకుండా బలవంతంగా చేపడుతున్న పనులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామస్థులు... సాగునీటి ప్రాజెక్టుల్లో ఇళ్లు, భూములు కోల్పోయారు. మల్లన్నసాగర్ తరహాలో పునరావాసం కల్పించాలని ముందునుంచి డిమాండ్ చేశారు.
మంగళవారం మళ్లీ మొదలైన పనులు
గతేడాది డిసెంబరు 27న పోలీసు బందోబస్తుతో పనులు జరిపిస్తుండగా... తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అదే తరహాలో జలాశయ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి ఆందోళన కొనసాగుతుండగా... తాజాగా పునరావాస సాధన దీక్ష చేపట్టడంతో పనులు నిలిచిపోయాయి. పోలీసు బందోబస్తుతో మంగళవారం మళ్లీ పనులు మొదలవడంతో... ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మా పొట్ట కొట్టొద్దు
లక్ష్మణాపురం వాసులు తరచూ పనులు అడ్డుకుంటుండటంతో... నాంపల్లి సీఐ ఆధ్వర్యంలో వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల పొలాల్లోని మట్టిని తరలించేందుకు గుత్తేదారు యంత్రాలతో సిద్ధం కాగా... అప్పటికే అక్కడకు చేరుకున్న నిర్వాసితులు అడ్డుకునే యత్నం చేశారు. మాపై కేసులు పెట్టినా సరే కానీ మా పొట్ట కొట్టకండి అంటూ బాధితులు... సీఐ కాళ్లపై పడ్డారు. పనులను అడ్డుకున్న గ్రామస్థులు (villagers protest)... పొక్లెయిన్లను వెనక్కు మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సీఐ ససేమిరా అనడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పురుగుమందు డబ్బాలతో యువకుల హల్చల్
గడ్డి నరేశ్, దాసరి కృష్ణయ్య అనే యువకులు పురుగు మందు డబ్బాలతో... యంత్రాలపైకి ఎక్కి హల్ చల్ చేశారు. పనులు ఆపకుంటే పురుగుల మందు తాగుతామని హెచ్చరించడంతో... పరిస్థితి చేయి దాటుతుందని భావించి యంత్రాలను అక్కడి నుంచి తరలించి పనులు నిలిపివేశారు. అటు మర్రిగూడ మండలంలోని చర్లగూడెం రిజర్వాయర్ వద్ద సైతం... ఆందోళన చోటుచేసుకుంది.
ఇదీ చూడండి:YS Sharmila Hunger Strike: కేసీఆర్కు మద్యంపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదు: వైఎస్ షర్మిల