నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ, సమీపంలో చింతపల్లి, గూడూరు, గ్రామ శివారులోని పంటపొలాలు, ఈదులగూడెం ప్రాంతంలోని ఖాళీ స్థలాలు, బంగారుగడ్డ ప్రాంతంలో, అద్దంకి-నార్కెట్పల్లి ప్రధాన రహదారి వెంట, నందిపాడు శివారులో ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్నెస్పీ పిల్లకాలువ వెళ్తుండగా దాన్ని బండ రాళ్లతో పూడ్చి వేసి చదును చేశారు. అనుమతి వచ్చేంత వరకు పనులు చేసేందుకు అవకాశం లేకపోయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి పనులు కానిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిలోకి సైతం హద్దులు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగితే... భారీ నష్టం
మరోవైపు నల్గొండ వై జంక్షన్ సమీపంలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నా... కనీస అనుమతులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్మాణాల విషయంలో పురపాలక అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కిందస్థాయిలో పర్యవేక్షణ లోపంతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
మార్కెటింగ్ చిట్కా...
రెవెన్యూ శాఖ నుంచి పంటపొలాలకు నాలా మార్పిడి మాత్రం చేయించి పురపాలికలో లే అవుట్ ఫీజు పేరుతో రూ. 10వేలు డీడీ మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ కాగితాలను చూపించి కొనుగోలు దారులను అనుమతి ఉన్న లేఅవుట్ల పేరుతో నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఎవరైనా పురపాలిక కిందిస్థాయి అధికారులు తనిఖీలకు వస్తే వారికి డీడీలు చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారు.