తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో.. రోజుకు 300 పైగా కొత్త కేసులు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిత్యం మూడు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో ఐదు రోజుల పాటు పాజిటివ్​ కేసులు మూడు వందల మార్కును దాటడం.. ఒక్క ఆగష్టు నెలలోనే 4852 కొవిడ్​ కేసులు నిర్ధారణ కావడం జిల్లాలో పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడం వల్ల జిల్లా ప్రజలు ఆందోళకు గురవుతున్నారు.

Highest Covid Cases In united Nalgonda District
ఉమ్మడి నల్గొండలో.. రోజుకు 300 పైగా కొత్త కేసులు!

By

Published : Sep 1, 2020, 4:44 PM IST

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజుకు మూడు జిల్లాల్లో కలిపి మూడు వందల పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ప్రతిరోజు..150కి పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆగష్టు 25 నుంచి 31 వరకు వారం రోజులు పరిశీలిస్తే... 30వ తేదీ మినహా మిగతా ఐదు రోజులు 150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత వారంలోనే 2101 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. యాదాద్రి జిల్లాలో కాస్త తక్కువగా ఉన్నా... సూర్యాపేట జిల్లాలో పరిస్థితి అంతకంతకూ ఇబ్బందికరంగా తయారవుతోంది. ఆ జిల్లాలో గత వారంలో నాలుగు రోజుల పాటు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మూడు జిల్లాల్లో కలిపి ఆగష్టు 25నాడు 301, 27నాడు 303, 28 నాడు 316, 29 నాడు 353, 31 నాడు అత్యధికంగా 374 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఈ స్థాయిలో ఉంటే... వెలుగులోకి రాని కరోనా కేసులు ఇంకా ఎక్కువే ఉంటాయని భావిస్తున్నారు.

ఆగస్టు 1 నుంచి 31 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా... మొత్తం 4852 కేసులు నమోదయ్యాయి. ఇందులో నల్గొండ జిల్లాలో అత్యధికంగా 2505... సూర్యాపేట జిల్లాలో 1604... యాదాద్రి భువనగిరి జిల్లాలో 743 ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బాధితులు కరోనా పరీక్షల కోసం గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తోంది. జలుబు, జ్వరం వంటి లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవాలన్న భయంతో జనాలు ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాల దగ్గరికి పరుగులు పెడుతున్నారు.

ఇవీ చూడండి: ప్రణబ్​ నిరుపమాన రాజనీతిజ్ఞుడు.. పాలనా విశారదుడు

ABOUT THE AUTHOR

...view details