కృష్ణానదికి వస్తున్న వరదలతోపాటు తుంగభద్ర నీరు తోడైన వేళ... శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. అక్కడ గేట్లు ఎత్తటంతో నాగార్జునసాగర్ నాలుగైదు రోజుల్లోనే జలకళతో తొణికిసలాడుతోంది. అయితే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఏటా క్రస్ట్ గేట్లను ఆగస్టు రెండో వారం లేదా ఆ తర్వాతి వారాల్లో ఎత్తుతారు. కానీ ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఆగస్టు తొలిరోజు నాడే నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్ ఫ్లో ఈ సీజన్లో జులై 28న మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం లక్షా 26 వేల క్యూసెక్కులతో మొదలైన వరద... ఇవాళ ఉదయం అత్యధికంగా 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఈ ఇన్ ఫ్లోనే అత్యధికం కాగా... జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. గత నెల 28న 190 టీఎంసీలతో ఉన్న ప్రాజెక్టుకు... ఈ నాలుగు రోజుల్లోనే మరో వంద టీఎంసీలు వచ్చి చేరింది. 312.04 టీఎంసీల గరిష్ఠ నిల్వకు గాను ప్రస్తుతం 290.22 టీఎంసీలు... 590 అడుగుల పూర్తిస్థాయి నిల్వకు గాను 582.5 అడుగుల మేర నీరుంది. కృష్ణాకు వస్తున్న ప్రవాహం కారణంగా సాగర్‌లో రోజుకు ఏడు అడుగులకు పైగానే నీరు చేరింది. దీంతో నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఎడమ కాల్వకు నీటి విడుదల
ఇవాళ సాయంత్రానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు... పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. సాయంత్రం తర్వాత గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎడమ కాల్వకు నీటిని వదలాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో క్రస్టుగేట్ల కన్నా ముందుగానే ఈరోజు మధ్యాహ్నం ఎడమ కాల్వతోపాటు... ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఏఎమ్మార్పీ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. గతేడాది ఎడమ కాల్వకు వదిలిన రెండ్రోజుల తర్వాతే... క్రస్ట్ గేట్లు ఎత్తారు. ఈసారి అందుకు భిన్నంగా రెండూ ఒకేరోజు చేపడుతున్నారు. ఎడమ కాల్వకు విడుదల చేసేముందు ఎన్నెస్పీ అధికారులు ప్రణాళిక రూపొందిస్తారు.