నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం, గూడూరు గ్రామ సరిహద్దుల మధ్య ప్రభుత్వ అటవీ భూములు కలిసి ఉన్నాయి. సర్వే నంబర్ 216లో 90.31 ఎకరాల రెవెన్యూ భూమి, 137 ఎకరాల అటవీభూమి ఉండగా.. 628 సర్వేనెంబర్లో 90.4 ఎకరాలు రెవెన్యూ భూమి ఉంది. వీటితోపాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు ఆక్రమణ దారులు.
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ఒకరిని చూసి మరొకరు...
ఒకరు తవ్వారని, మరొకరు తవ్వుకుంటూ ఆక్రమించుకుని స్వతహాగా లీజ్‌కి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అవంతిపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సుమారు 10 ఎకరాల మేర తవ్వకాలు చేసి లక్షలు తీసుకుని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి లీజుకు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నా... అధికారులు చర్య తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ దందాలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
ఆక్రమణల పర్వం
సుమారు వెయ్యి ఎకరాల రెవెన్యూ అటవీ భూములు ఉండగా కొన్నేళ్లుగా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. తొలుత గుట్టలను తొలగించి మట్టిని విక్రయిస్తారు. తదుపరి చదును చేసి ఆభూములను సేద్యం చేసేందుకు అనువుగా ఉంచుతారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని ఈ భూములకు అందిస్తున్నారు.
రహదారికి కూతవేటు దూరంలో
ఈ భూములను అక్రమదారులు తమకు అనుకూలమైన వారికి కౌలుకు ఇస్తున్నారు. మరికొందరు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించుకుంటున్నారు. ఇవి మిర్యాలగూడ-కోదాడ ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో ఉన్నాయి. పేరొందిన సంఘానికి నియోజకవర్గ బాధ్యుడిగా చలామణి అవుతున్న ఒకరు సుమారు పది ఎకరాల భూమిని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది! ఈ భూమిని మూడు లక్షలు తీసుకొని వేరొకరికి లీజుకు ఇచ్చినట్లు సమాచారం.
ఆక్రమణదారులను సహించేదిలేదని తహసీల్దార్ కార్తిక్ అంటున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 'భాజపాతో కలిస్తే.. స్వతంత్రులపై పాదరక్షల వర్షమే'