తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్యాలగూడలో ఉచిత విద్యుత్​తో నీటి వ్యాపారం

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ ఉచిత విద్యుత్ పక్కదారులు పడుతోంది. పట్టణ ప్రాంత అవసరాలకు పంట పొలాల్లోని బోర్లతో నీటి వ్యాపారం సాగిస్తున్నారు అక్రమార్కులు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్​తో ట్యాంకర్లు నింపుకొని ట్రిప్పుకు 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

ఉచిత విద్యుత్​తో నీటి వ్యాపారం

By

Published : Apr 16, 2019, 6:36 PM IST

ఉచిత విద్యుత్​తో నీటి వ్యాపారం

రైతులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న విద్యుత్ పక్కదారులు పడుతోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో పంట అవసరాలు లేని సమయంలో భూగర్భ జలాలు తోడుతూ పట్టణాలకు ట్యాంకర్లతో తరలిస్తున్నారు అక్రమార్కులు.

15రోజుల క్రితం మొదలైన అక్రమదందా

మిర్యాలగూడ చుట్టుపక్కన గ్రామాల్లో గత 15 రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగుతోంది. కొందరి తీరుతో ప్రభుత్వ సమున్నత లక్ష్యం నీరుగారి పోతోంది.

అడుగంటిన భూగర్భజలాలు

రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో పట్టణాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. బోర్లకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా.. కొందరు పంట పొలాల్లో యజమాని నుంచి కొంత భూమి కౌలుకు తీసుకుని వాటిలో బోర్లు వేయించి రైతుల పేరిట విద్యుత్ మీటర్లు అమర్చుకుంటున్నారు. 5 హెచ్​పి అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన బోరు మోటార్లను అమర్చి నీరు తోడేస్తున్నారు.

డిమాండ్​ను బట్టి రూ.1000 వరకు వసూలు

ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఉచిత విద్యుత్తును వినియోగిస్తూ రోజుకు వందల సంఖ్యలో ట్యాంకర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. పట్టణంలో గృహ నిర్మాణాల కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పనులకు... వివాహ, ఇతర వేడుకలకు ఒక్కో ట్యాంకర్​ నీటిని రూ.600 నుంచి 1000 వరకు అమ్ముతున్నారు.

భారీ ఎత్తున ఆర్జిస్తున్న దళారులు

పట్టణానికి దగ్గరగా ఉండే నందిపాడు, గూడూరు, సెట్టిపాలెం, కిష్టాపురం, వెంకటాద్రిపాలెం గ్రామాల్లో ఈ దందా సాగుతోంది. ఈ వ్యవహారంలో దళారులు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. అక్రమ విద్యుత్ వినియోగాన్ని అరికట్టాల్సిన విద్యుత్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.

ఇలాంటి అక్రమ చర్యలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని డివిజినల్ ఇంజనీర్ వెంకట కృష్టయ్య అంటున్నారు. ఏవైనా ఘటనలు తమకు ఎదురైతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా విద్యుత్​ను దుర్వినియోగం చేస్తే వాళ్లను జైలుకు పంపుతామన్నారు.

ఇవీ చూడండి:స్ట్రాంగ్​రూముల భద్రతను కేంద్రానికి అప్పగించాలి: జగన్

ABOUT THE AUTHOR

...view details