తెలంగాణ

telangana

ETV Bharat / state

MYSTERY: ఆ ఊళ్లో అగ్గి రోజూ రాజుకుంటోంది.. అసలేం జరుగుతోంది?

ఎవరు చేస్తున్నారో తెలియదు.. ఎలా జరుగుతుందో తెలియదు.. ఇదేమైనా మాయనా.. ఊరంతా కాపలా కాసినా కూడా ఎలా జరుగుతుందో తెలియదు. అగ్గి మాత్రం రాజుకుంటోంది. అది కూడా ఇంట్లో దుస్తులకు, గడ్డివాములకు లేదా పశువుల కొట్టాలకు ఒక్కసారిగా అగ్గి రాజుకొని తగలబడుతున్నాయి. ఇదేదో రాత్రివేళల్లో జరుగుతున్న తంతు కాదు.. ఇదంతా మిట్టమధ్యాహ్నం జరుగుతోంది ఆ గ్రామంలో. ఎవరి ఇంట్లో దుస్తులు కలిపోతాయో, ఎవరి గడ్డి వాములకు నిప్పు అంటుకుంటుందో, ఎవరి పశువుల కొట్టాలు తగలబడతాయోనని భయంతో గడుపుతున్నారు ఆ గ్రామస్థులు. ఇంతకీ ఇది ఎలా జరుగుతుంది.. ఆ మాయ ఎంటి అంతుచిక్కని మిస్టరీతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ గ్రామస్థులు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

pathur thanda mystery
పాతూరు తండా మిస్టరీ

By

Published : Aug 8, 2021, 7:51 AM IST

నల్గొండ జిల్లా చందంపేట మండలం ముర్పుతల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామం పాతూరు తండా. ఈ తండాలో సుమారుగా 200 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామంలో అధికంగా గిరిజనులే ఉన్నారు.. అయితే ఈ గ్రామంలో ఓ వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వ్యాపిస్తున్నాయో తెలియకుండానే మంటలు అంటుకొని ఇంట్లో ఉన్న బట్టలు, పశువుల కొట్టాలు, గడ్డివాములు తగలబడిపోతున్నాయి. దీంతో గ్రామంలో అందరూ భయాందోళనలతో జీవనం గడుపుతున్నారు.

కావాలనే చేస్తున్నారా..

ప్రస్తుత ఆధునిక సమాజంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో.. గ్రామస్థులది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ తండాలో గత 22 రోజులుగా ఏదో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటోంది. ఇదేదో రాత్రివేళలో జరుగుతుందంటే ఎవరో కావాలని చేస్తున్నారనుకోడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇదంతా మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఏదో ఒక ఇంట్లో బట్టలు, మరికొందరికి చెందిన పశువుల పాకలు, గడ్డివాములు కాలిపోవడం లాంటి ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. మొదట్లో ఇదేదో అగ్నిప్రమాదమని అనుకున్నారు ఆ గ్రామస్థులు.. కానీ వరుసగా జరుగుతుండటంతో గ్రామానికి ఏదో కీడు జరిగిందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పాతూరు తండాలో అగ్ని ప్రమాదాలపై గ్రామస్థుల స్పందన

పోలీసుల నిఘా విఫలం

ఆ తండాలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రెండు మూడు సందర్భాల్లో నిఘా పెట్టినా ఆ ఘటనలు అలాగే జరగడంతో ఇక ఊరంతా కూడా కాపలా కాసినా అగ్నిప్రమాదాలు ఆగడం లేదు. ఈ ఘటనలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు తండావాసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతుచిక్కని మిస్టరీ గానే మిగిలిపోయింది. జరుగుతున్న సంఘటనలతో తండావాసులు గ్రామానికి ఎవరో చేతబడిలాంటిది చేయించారనే అనుమానంతో.. వారం క్రితం రూ. 70వేలు వెచ్చించి ఒక మంత్రగాడిని తీసుకొచ్చి మంత్రపూజలు చేయించారు. ఐతే ఆ మంత్రగాడు పూజలు చేసిన రోజు మాత్రం గ్రామంలో ఎలాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో కొంతమేర ఊపిరిపీల్చుకున్నారు గ్రామస్థులు.

గ్రామంలో గత 25 రోజులుగా వరుసగా ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదో ఒకటి తగలబడిపోతుంటుంది. మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. తిండి, నిద్ర కరవై భయాందోళనలకు గురవుతున్నాము. ఇంట్లో దుస్తులతో పాటు వాటి మధ్యలో ఉన్న డబ్బులు, పశువుల పాక, గడ్డివాములు తగలబడిపోతున్నాయి. హోమాలు, పూజలు చేసినా ప్రమాదాలు ఆగడం లేదు. అధికారులు స్పందించి ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో గుర్తించి.. పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. -గ్రామస్థులు, పాతూరు తండా

మిస్టరీ వీడేనా.?

కానీ మరుసటి రోజు నుంచి మళ్లీ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆరోజు తప్ప మరుసటి రోజు నుంచి తండా వాసులు కాపలాగా ఉన్నా.. తాళాలు వేసినా.. ప్రజలు చూస్తుండగానే మళ్లీ ఇళ్లలో దుస్తులు కాలిపోవడం, ఇళ్ల గుడారాలు కాలిపోవడం, పశువుల పాకలు, గడ్డివాముల దహనం లాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేక కుట్ర కోణంలో జరుగుతుందా.. ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిఘా పెట్టినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఇది పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే రెండు సార్లు పెద్ద మొత్తంలో నగదు వెచ్చించి మంత్రగాళ్లను తీసుకొచ్చి, మూగజీవాలను బలి ఇచ్చి, మంత్ర పూజలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో గత శనివారం తండాలో మరోమారు శాంతి పూజలు, హోమం నిర్వహించారు. ఈ రోజు నుంచైనా తమ గ్రామంలో వింత సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరోవైపు ఈ గ్రామంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై.. పోలీసులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని.. మిస్టరినీ ఛేదించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:హుజూరాబాద్​లో దళితులకేమో కోట్లు.. ఇక్కడేమో చచ్చిపోతే కనీసం పరామర్శించరా?

ABOUT THE AUTHOR

...view details