మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనాలంటూ (minimum support price) నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద రైతులు ధర్నా చేపట్టారు (Farmers protest at Vemulapalli ). మిల్లుల యజమానులు సకాలంలో ధాన్యం కొనడంలేదని ఆందోళన తెలిపారు. నిన్న, మొన్నటి వరకు క్వింటాకు రూ.1,820 ఇవ్వగా... బుధవారం నుంచి రూ.1,600 నుంచి 1,700 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ సాగర్ ఆయకట్టులో ముందుగా సాగుచేసిన పంటను అమ్మేందుకు తీసుకొచ్చి రెండురోజులుగా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నామని అన్నారు. పచ్చని వడ్లు ట్రాక్టర్‌లో నిల్వ ఉంటే రంగుమారతాయని... దానిని సాకుగా చూపి మరింత తక్కువ రేటు ఇస్తారని మండిపడ్డారు. శెట్టిపాలెం పరిసరాల్లో 15 మిల్లులు ఉంటే 2 మిల్లుల్లో మాత్రమే ధాన్యం కొంటున్నారని తెలిపారు. మిల్లు యజమానుల తీరుతో విసుగుచెందిన అన్నదాతలు... అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ఆందోళన చేశారు. రైతుల ధర్నాతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.