తెలంగాణ

telangana

ETV Bharat / state

వరి ధాన్యం అమ్ముడుపోక రైతుల ఆవేదన

ధాన్యం అమ్ముకునే రైతు పరిస్థితి దయనీయంగా మారింది. కొనుగోళ్లు ప్రారంభం కాకముందే సరకును కేంద్రాలకు తరలించినా.. ఎప్పుడు కొంటారనేదానిపై స్పష్టత లేకుండా పోయింది. వానకు నాని, ఎండకు ఎండుతూ మొలకలు వస్తున్న తీరును చూసి... సాగుదారుడు లబోదిబోమంటున్నాడు. చేసేది లేక ఆవేదనతో రోడ్డెక్కుతున్నాడు.

farmers not selling paddy grain conditions in telangana
వరి ధాన్యం అమ్ముడుపోక రైతుల ఆవేదన

By

Published : Oct 18, 2020, 5:21 AM IST

వరి ధాన్యం అమ్ముడుపోక రైతుల ఆవేదన

ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై అస్పష్ట పరిస్థితులు నెలకొన్న వేళ.. రైతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 15 రోజుల నుంచి పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నా.. కొనుగోళ్లపై స్పష్టత లేదు. వర్షాలతో ఇప్పటికే పంటలు కోల్పోయిన రైతులు... ధాన్యాన్ని సైతం నష్టపోవాల్సి వస్తోంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... సాగుదారుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన 20 మండలాల్లో 18 మండలాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనివే కాగా.. ఆ ప్రభావం పంటలపై తీవ్రస్థాయిలో పడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షా 75 వేల ఎకరాల్లో పంట నష్టం చోటుచేసుకోగా.. అందులో వరి లక్ష ఎకరాల్లో ఉంది. రైతులు కోల్పోయింది.. నాలుగు వందల కోట్ల పైమాటేనని అధికారులు అంచనా వేశారు. వానాకాలం తొలినాళ్లలో పంటలు వేసుకున్న రైతులు... 15 రోజుల నుంచి ధాన్యం తరలిస్తున్నారు. వడ్లను కేంద్రాలకు తెస్తున్నా... ఎప్పుడు కొంటారో తెలియని సంకట స్థితి నెలకొంది.

రోడ్డెక్కుతున్న అన్నదాత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 లక్షల 917 ఎకరాల్లో పంటలు సాగవగా.. 24 లక్షల 45 వేల 245 మెట్రిక్ టన్నుల దిగుబడులు ఉంటాయని అంచనా వేశారు. ఐకేపీ, పీఏసీఎస్​, మార్కెటింగ్ విభాగాలు కలిపి మొత్తం 870 కేంద్రాలు తెరుస్తుండగా.. వాటిలోకి 14 లక్షల 90 వేల 286 మెట్రిక్ టన్నులు వస్తుందని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ధాన్యం తెస్తున్న రైతులు... కుప్పలు పోస్తున్నారు. అయితే కొనేవారు లేక... ధాన్యం వానకు తడిసి మొలకలు రావడాన్ని తట్టుకోలేక అన్నదాత రోడ్డెక్కుతున్నాడు. నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రం వద్ద..గురువారం నాడు రైతులు ఆందోళన నిర్వహించారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలోనూ అన్నదాతలు ధర్నాకు దిగారు. వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం గురించి పట్టించుకోవడం లేదంటూ.. వంద మందికి పైగా కర్షకులు రహదారిపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో గంటన్నరకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.

రైతుల కన్నీరు

అటు వరంగల్‌ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానలకు పంట మొత్తం తడిసి పోయి..గింజలు మొలకెత్తుతున్నాయి. సర్కారు చెప్పినా వినకుండా సాగుచేశారని.. క్వింటాలు 500 రూపాయల చొప్పున తీసుకుంటామని వ్యాపారులు తెగేసి చెప్పడం వల్ల రైతులు కన్నీరు పెడుతున్నారు.

ఇలాంటి తీవ్ర విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి :అప్రమత్తంగా ఉండండి: డీజీపీ మహేందర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details