గతేడాది కాలంగా కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న హోటల్స్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గత నెల రోజులుగా కిటకిటలాడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రం హాలియాతో పాటు నిడమనూరు, నాగార్జునసాగర్ పురపాలికలోని విజయ్‌విహార్ హోటల్స్ అన్ని పార్టీల నేతలు, నాయకులతో సందడిగా కనిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో పాటు స్థానిక నేతలూ మధ్యాహ్నం, రాత్రి భోజనం హోటల్స్‌లోనే చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని హాలియాలో హోటల్ నిర్వహిస్తున్న వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
అన్ని పార్టీల నాయకులు అక్కడే తిష్ఠ
నియోజకవర్గంలో ఉన్న ఏకైక మూడు నక్షత్రాల హోటల్ అయిన సాగర్ పురపాలికలోని విజయ్‌విహార్ గత నెలరోజులుగా వివిధ పార్టీల నాయకులతో కళకళలాడుతోంది. మంత్రులతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు, తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇక్కడే ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారాంతంలో తప్ప ఎప్పుడూ ఖాళీగా ఉండే హోటల్ పరిసరాలు కార్లతో నిత్యం రద్దీగా కన్పిస్తోంది.
మూడు గంటల ప్రచారానికి రూ.300
గ్రామాల్లో వివిధ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.300 చొప్పున ఆయా పార్టీలు చెల్లిస్తున్నాయి. సాయంత్రం మరో పూట ప్రచారానికి కూలీలు వేరే పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారు మూడు గంటల ప్రచారానికి మరో రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో రోజూ కనిష్ఠంగా రూ.500 వరకు గరిష్ఠంగా రూ. 1000 వరకు సంపాదిస్తున్నారు. వీరికి రాత్రి భోజనంతో పాటు మద్యం అదనంగా దక్కుతోంది.