తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇది స్కూటర్ కాదు దుక్కి దున్నే యంత్రం

ఆన్​లైన్​లో ఆర్డర్ చేస్తే... అన్ని మనముందుకొచ్చే ఈ రోజుల్లో కూడా రైతులు కష్టపడి పండించనిదే పంట పండట్లేదు. పంటలు పండిచేందుకు కొత్త యంత్రాలొస్తున్నా కర్షకులు వాటిని వినియోగించుకోవాలంటే అధికంగా డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఆ బాధను అర్థం చేసుకున్న ఓ రైతు బిడ్డ తక్కువ ఖర్చుతో కలుపు తీసే యంత్రాన్ని కనిపెట్టి తన తల్లి కష్టాన్ని తీర్చాడు.

dukki-dunne-engine-invester-one-young-boy-1-1
ఇది స్కూటర్ కాదు దుక్కి దున్నే యంత్రం

By

Published : Jun 29, 2019, 6:59 PM IST

Updated : Sep 3, 2022, 2:29 PM IST

రైతు కుటుంబాల్లో పుట్టిన వారికి మాత్రమే అర్థవుతుంది అన్నదాతల కష్టం. నారు పోసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుత కాలంలో కూలీ ఖర్చులు పెరిగి సాగు భారమవుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ యువకుడు కలుపుతీత యంత్రాన్ని రూపొందించి కర్షకుల కష్టాలను కొంతైనా తీర్చేందుకు కృషి చేశాడు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంకు చెందిన గడ్డం సైదులు, నాగమ్మల కుమారుడు శ్రీకాంత్. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఐటీఐ చేసి చదువు ఆపేశాడు. తర్వాత బైక్ మెకానిక్​గా పనిచేస్తూ... వీరికున్న రెండెకరాల భూమిలో పత్తి సేద్యం చేస్తున్న తన తల్లికి సాయం చేస్తుంటాడు. కలుపు నివారణకు కూలీలు దొరకక, ట్రాక్టర్​లు, కాడెద్దుల కిరాయి పెరగడంతో... తల్లి పడుతున్న ఇబ్బందులను గుర్తించాడు. ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయగలనా అని ఆలోచించి కలుపుతీత యంత్రాన్ని తయారు చేసేందుకు రూపకల్పన చేశాడు.

గుంటక అమర్చిన ఫ్రేమ్(ఛాయిస్)కు బజాజ్ చేతక్ ఇంజన్​ను అమర్చి వాటి కింద నడిచేందుకు రెండు ఆటో టైర్లను అమర్చాడు. ఈ యంత్రం తయారీకి వాడిపాడేసిన పాత సామాన్లే వాడాడు. లీటరు పెట్రోల్​తో రెండు గంటల్లో ఎకరం భూమిలో కలుపు తీసేలా తయారు చేశాడు. మొత్తం 15 వేల రూపాయలతో యంత్రాన్ని రూపొందించాడు. దీని వల్ల తక్కువ ఖర్చుతో సులభంగా కలుపు తీయొచ్చని రైతులు చెబుతున్నారు.

శ్రీకాంత్​కి చిన్నప్పటి నుంచి మెకానికల్ ఫీల్డ్ మీద ఉన్న అభిరుచి వల్లే ఈ యంత్రం తయారు చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే... రైతులకు ఉపయోగపడే మరిన్ని పరికరాలను తయారు చేస్తాడని తెలిపారు.

ఇవీ చూడండి: యువతి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం

Last Updated : Sep 3, 2022, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details