గ్రీన్ జోన్లో ఉన్న యాదాద్రి జిల్లాలో... వలస కూలీలతో అంతకంతకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. యాదాద్రితోపాటు వారం నుంచి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొవిడ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడ్డారు.
చౌటుప్పల్‌కు చెందిన వ్యాపారి... నిత్యం హైదరాబాద్ నుంచి తెచ్చిన కూరగాయల్ని మార్కెట్లో అమ్ముతుంటాడు. మే 25న అనారోగ్యంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. తగ్గకపోవడం వల్ల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ కరోనా నిర్ధరణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన నలుగుర్ని వైద్యాధికారులు పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
రాజపేట మండలానికి చెందిన మహిళ... బిడ్డను ప్రసవించి ప్రాణాలు కోల్పోయింది. ఆ పసికందు కూడా మృత్యువాత పడ్గింది. తల్లీబిడ్డల నమూనాలు పరీక్షకు పంపగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబానికి చెందిన 9మందిని బీబీనగర్ ఎయిమ్స్ ఐసోలేషన్‌కు తరలించారు.
నల్గొండ పట్టణానికి చెందిన యువకుడు... రెండ్రోజుల క్రితం విజయవాడ నుంచి తిరిగివచ్చాడు. ఛాతిలో నొప్పంటూ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయిస్తే హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలింది. సదరు బాధితుడి కుటుంబంలో మొత్తం... ఏడుగురిని క్వారంటైన్ చేశారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఆర్నెల్ల చిన్నారి, 84 సంవత్సరాల వృద్ధురాలు ఉన్నారు.
ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 85 కేసులు నమోదు కాగా... అందులో ఒక యాక్టివ్ కేసు మాత్రమే ఉంది. 83 మంది డిశ్చార్జి కాగా... నాలుగు నెలల చిన్నారి మృత్యువాత పడ్డాడు. నల్గొండ జిల్లాలో మొత్తం 16 మందికి వైరస్ సోకగా... అందులో 15 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. ఇక వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి సొంత గూటికి చేరిన యాదాద్రి జిల్లా వాసుల్లో... ఇప్పటివరకు 37 మంది కరోనా బారినపడ్డారు. వీరందర్నీ హైదరాబాద్ లెక్కల్లో కలిపారు.