నాగార్జునసాగర్‌లో మళ్లీ విజయబావుటా ఎగురవేయాలనే పట్టుదలతో అధికార తెరాస విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అమాత్యులు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా.. తెరాసను ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అనుముల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తలసాని... స్థానిక కార్యకర్త ఇంట్లో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి తెరాస కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
మంత్రికి నిరసన సెగ
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెరాస శ్రేణులతో కలిసి పిండి వంటలు ఆరగించారు. సాగర్ ఉప ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనుముల మండలం కొత్తపల్లిలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు నిరుద్యోగ భృతి, ఉద్యోగనియామకాలపై మంత్రి జగదీశ్ రెడ్డిని నిలదీశాడు. ప్రచారం ముందుకు సాగకుండా అడ్డుకున్నాడు. టీచర్ తీరుపై ఆగ్రహించిన మంత్రి... నీలాంటి వారిని చాలామందిని చూశానని.. మీ నాయకులపై కఠినంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యలు చేశారు.