Youth Congress Leader Vallabh Reddy Arrest : ఓ రాజకీయ నేత కుమారుడు పెళ్లైన ఏడాదికే భార్యను హత్య చేశాడు. ఆపై.. గుండెపోటుతో చనిపోయినట్లు అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. తనకున్న రాజకీయ పలుకుబడితో హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించాడు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి. శవ పరీక్ష నివేదికలో అసలు విషయం బయటపడటంతో కటకటాల పాలై.. ఊచలు లెక్కబెడుతున్నాడు. నారాయణగూడ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
Congress Leader Arrested in Wife's Murder Case : నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి (29) ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ లీడర్‌గా కొనసాగుతున్నాడు. ఇతడికి సంవత్సరం కిందట లహరి (27) అనే అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కాపురం పెట్టారు. అంతా సవ్యంగానే సాగుతుండగా.. ఈ నెల 14న లహరి ఇంట్లో కళ్లు తిరిగి కింద పడిపోయింది. తలకు గాయాలు కావడంతో వల్లభ్‌రెడ్డి ఆమెను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అనంతరం లహరి తండ్రి జైపాల్‌రెడ్డికి సమాచారం అందించాడు. ఆయన హాస్పిటల్‌కు వచ్చేలోగా.. చికిత్స పొందుతున్న లహరి కన్నుమూసింది. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నివేదికలో లహరి శరీరంలో గాయాలు ఉన్నట్లుగా తేలడంతో ఈ నెల 26న వల్లభ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దాంతో అతడు అసలు విషయం చెప్పేశాడు.
అసలు ఆరోజు ఏమైందంటే..? ఈ నెల 13న రాత్రి.. 14వ తేదీ ఉదయం వల్లభ్‌రెడ్డి, లహరి దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వల్లభ్.. లహరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తల, పొత్తి కడుపు భాగంలో దెబ్బలు బలంగా తాకడంతో లహరి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించి..గుండెపోటుతో మరణించినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు హత్యగా తేలడంతో నారాయణగూడ పోలీసులు హత్య, సాక్ష్యాలు చెరిపేసినట్లుగా నిర్ధారించి సెక్షన్ 201, 302 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 14న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. లహరి అనే ఓ వివాహిత మృతిపై అనుమానాలున్నాయని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. పోస్టుమార్టం రిపోర్టులో లహరి శరీరంలో గాయాలున్నట్లు తేలింది. దీంతో ఆమె భర్త వల్లభ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసినట్లుగా అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం.-శ్రీనివాస్, నారాయణగూడ సీఐ