తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి మునుగోడు ప్రచార బరిలో కాంగ్రెస్‌, ఆ నినాదంతో ఇంటింటికీ.. - hyderabad latest news

congress campaign in munugode constituency: కాంగ్రెస్‌ నేడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగనుంది. గడప గడపకు కాంగ్రెస్‌ అనే నినాదంతో మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు ఈ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల ఆరో తేదీ వరకు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మీ మునుగోడు - మీ కాంగ్రెస్‌ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది.

నేటి నుంచి మునుగోడు ప్రచార బరిలో కాంగ్రెస్‌, ఆ నినాదంతో ఇంటింటికీ..
నేటి నుంచి మునుగోడు ప్రచార బరిలో కాంగ్రెస్‌, ఆ నినాదంతో ఇంటింటికీ..

By

Published : Sep 1, 2022, 7:44 AM IST

congress campaign in munugode constituency: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ప్రకటన కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో క్యాడర్‌ చేజారకుండా పీసీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాజీవ్‌గాంధీ జయంతి రోజున పొర్లగడ్డ తండాలో పార్టీ పతాకాన్ని ఎగురవేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భాజపా, తెరాస నేతలు క్షేత్రస్థాయిలో ఉంటూ వ్యూహాలు అమలు చేస్తుండడంతో దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల ఇన్‌ఛార్జీలను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

మన మునుగోడు - మన కాంగ్రెస్‌ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని తెలిపారు. స్థానిక నాయకులను కలుపుకొని జనంలోకి వెళ్లాలని.. భాజపా, తెరాస వైఖరిని ఎండగట్టాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని, ఆర్థిక ఒప్పందంలో భాగంగానే భాజపాలో చేరారని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ తెలిపింది. మండలాలు, పంచాయతీల వారీగా భాజపా, తెరాసలో చేరిన నేతలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయా పార్టీలపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించింది.

ఈ నెల 3న ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొని.. ఆ తరువాత నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలువురు ఎంపీటీసీలు, సర్పంచిలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థ్యైర్యం పెంపొందించాలని పీసీసీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందే అభ్యర్థిని ప్రకటించడం సరికాదని భావిస్తోంది. అన్ని అంశాలపై చర్చించి ఆశావహుల అభిప్రాయాలను కూడా తీసుకుని సమగ్ర నివేదికను అధిష్ఠానానికి పంపింది. ఆశావహుల్లో టికెట్‌ ఎవరికి వస్తుందనే విషయాన్ని పక్కనపెట్టి.. జనంలోకి వెళ్లడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఇవీ చూడండి..

మునుగోడు ప్రచారానికి ముహుర్తం ఖరారు.. హస్తం నేతల్లో హుషారు...

ABOUT THE AUTHOR

...view details