భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం - సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
16:16 May 02
భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం
సాగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పట్టం కట్టారని సీఎం కేసీఆర్ అన్నారు. తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తానని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్‌తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను శరవేగంగా పూర్తి చేసిన ప్రజలకు నీరందిస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. విజయం సాధించిన అభ్యర్థి నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం