Charlagudem project: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న అతిపెద్ద జలాశయం చర్లగూడెం. సుమారు 11.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ జలాశయంలో చర్లగూడెంతోపాటు నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నాలుగు గ్రామాల్లోని సుమారు 833 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నాయని రెవెన్యూ అధికారులు లెక్కతేల్చారు. ఇందులో ఒక్క చర్లగూడెం రిజర్వాయర్‌లో మొత్తం 233 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నారని అధికారులు గుర్తించారు.
ఇందులో 213 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ పరిహారం కింద చెక్కులు ఇచ్చారు. మరో 20 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. మెరుగైన పరిహారం ఇవ్వాలంటూ మే 10 నుంచి జూన్ 24 వరకు సుమారు 45 రోజులు నిర్వాసితులు నిరసనలు చేశారు. వీరిలో కొందరికి పరిహారం అందకపోగా మరికొందరికి సరైన పరిహారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే పరిహారం మంజూరైనా స్థానికంగా ఉండడం లేదని చెక్కులు ఆపినట్లు నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అందరిలాగే తమకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించిన వల్లభదాసు కేశవులు కుటుంబానికి రావాల్సిన సుమారు 15 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కులను... అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆపారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులందరితో సంతకాలు చేయించాలని చెబితే చేయించానని... అయినప్పటికీ పరిహారం ఇవ్వడంలేదంటూ కేశవులు వాపోయారు.