గేర్ మార్చిన కాంగ్రెస్.. మునుగోడులో కాంగ్రెస్, భాజపాల ప్రచారాల హోరు Munugode by election: మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న తెరాస ప్రజల్లోకి వెళ్తుడంగా.. కాంగ్రెస్, భాజపా ఇంటింటి ప్రచారం చేస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం బోటిమీది తండా, వాయిలపల్లి, జనగాంలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు.
రేవంత్ రెడ్డి రోడ్ షో:పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించిన రేవంత్ రెడ్డి కొంతమంది నాయకులు స్వార్థం, కాంట్రాక్టుల కోసం ఉపఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్‌ను గెలిపిస్తే పోడుభూముల సమస్యపై కొట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు. తెరాస, భాజపాలను ఎందుకు గెలిపించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్‌ఛార్జ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు మండల సమన్వయ కర్తలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.
నల్గొండ పర్యటనలో లక్ష్మణ్: ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు పాల్గొన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో తెరాస, భాజపాను మించినవారు లేరని ఆరోపించారు. దేశ సంపద ప్రజలకు దక్కాలంటే కాంగ్రెస్‌ని గెలిపించాలని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మరో ఉపఎన్నికలో భాజపా గెలవడం ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నల్గొండజిల్లా పర్యటనలో భాగంగా. సురధాస్ భవన్ అంధుల పాఠశాలలో నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తెరాస పాలనతో విసిగిపోయిన జనం మార్పుకావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి కుటుంబ పాలనను అంతం చేయటానికి భాజపాకు మద్దతివ్వాలని మునుగోడు ప్రజలను కోరారు. ప్రజల దృష్టి మల్లించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి హామీలకు తెరలేపారని లక్ష్మణ్ విమర్శించారు. త్వరలో ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న నేతలు అంతకముందే నియోజకవర్గాన్ని చుట్టేయాలని పార్టీలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి: