తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్​లో ప్రచారజోరు పెంచిన భాజపా - బీజేపీ వార్తలు

అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో ప్రకటించి... ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో దూకుడు పెంచింది. ప్రచారం చివరి అంకంలో... సీనియర్ నేతలంతా మండలాలు చుట్టివచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే కిషన్ రెడ్డి, డీకే అరుణ, రాజాసింగ్‌ ప్రచారం నిర్వహించగా.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగారు.

ravi nayak
రవి నాయక్​

By

Published : Apr 13, 2021, 8:23 PM IST

రవి నాయక్​

తెరాస, కాంగ్రెస్ పూర్తి స్థాయి కేడర్​ను రంగంలోకి దింపాయి.. భాజపా నుంచి ఇంకా సందడే మొదలు కాలేదు. ఇదీ... నిన్నమొన్నటి వరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో వినిపించిన మాట. కానీ ప్రచారం చివరి అంకంలో... కమలం పార్టీ విస్తృతంగా పర్యటనలు చేపడుతోంది. సీనియర్ నేతల్ని రప్పించి... ఓట్లు పడేలా వ్యూహాలు సిద్ధం చేసింది. బండి సంజయ్.. మూడు రోజుల్లో నియోజకవర్గం చుట్టి వచ్చేలా.. ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి రవినాయక్​ను గెలిపించుకునేందుకు.. శతథా యత్నిస్తున్నారు.

కిషన్ రెడ్డి ప్రచారం

కమలం పార్టీ తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. శని, ఆదివారాల్లో విస్తృతంగా రోడ్ షోల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోనే ఉండి... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ... రెండ్రోజుల పాటు ఓటర్లతో మమేకమై భాజపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినీనటుడు బాబూమోహన్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ హాలియాలో సమావేశం నిర్వహించి... రోడ్ షోకు హాజరయ్యారు. తెరాస తీరును సదరు నేతలు తీవ్రంగా ఎండగట్టారు.

రంగంలోకి బండి

బండి సంజయ్​తోపాటు.. విజయశాంతి ప్రచార రంగంలోకి దిగారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని గ్రామాల్లో.. విజయశాంతి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఓట్ల శాతంలో రెండో స్థానంలో నిలుస్తున్న గిరిజనులు.. ఎన్నికల్ని ప్రభావితం చేయనున్నారు. ఆ కోణంలో భాజపా.. గిరిజన సామాజికవర్గానికి చెందిన రవికుమార్‌కు టికెట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థిని గెలుపు తీరాలకు చేర్చాలన్న భావనతో.. ప్రచార పర్వంలో జోరు పెంచింది. పోలింగ్ గడువు సమీపిస్తున్న సమయంలో చేసే ప్రచారం.. తమకు కలసివస్తుందన్న భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

ఉప ఎన్నికల మేనిఫెస్టో

తెరాస, కాంగ్రెస్‌కు భిన్నంగా.. ప్రత్యేకంగా ఉప ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది భాజపా. తమ అభ్యర్థి గెలిస్తే.. నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు.. నాగార్జునసాగర్-హైదరాబాద్ మార్గంలో పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి తెస్తామన్నారు నేతలు. ఇలా రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొనేందుకు కమల దళం.. పావులు కదుపుతోంది.

ఇదీ చదవండి:దివ్యాంగులకు సాయమందించిన ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details