ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పరిపాలనతో తానీషాను తలపించేలా తయారయ్యారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ విమర్శించారు. కేసీఆర్ సర్కారు... అన్ని వ్యవస్థలను తిరోగమన దిశలోకి తీసుకెళ్లిందని ఆరోపించారు. ప్రకృతి వనరులతో అలరారుతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. తెరాస, కాంగ్రెస్ పాలనలపై నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన సమావేశంలో ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఏడు పర్యాయాలు శాసనసభ్యుడిగా, 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా... నియోజకవర్గానికి జానారెడ్డి చేసిందేమీ లేదని విమర్శలు చేశారు.
మీరు చేసిన పనులకు ఈ ఛార్జిషీట్ ఓ ట్రైలర్ మాత్రమే. సినిమా మొత్తం చూస్తే వారి పాపాల వల్ల బత్తాయికి మద్దతు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలుస్తుంది. బత్తాయి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, జానారెడ్డి ఇద్దర్ని మేము అడుగుతున్నాం. జ్యూస్ ఫ్యాక్టరీ ఎప్పుడొస్తుందని స్థానిక ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.