తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్‌ బీబీసీ తీసుకుని మోసపోవద్దన్న విజయశాంతి - విజయశాంతి

Vijayasanthi On CM KCR ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే బీబీసీలకు ప్రజలు మోసపోవద్దని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి విజ్ఞప్తి చేశారు. మునుగోడులో ఏర్పాటు చేసిన భాజపా సమరభేరి సభలో ఆమె మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Vijayasanthi
Vijayasanthi

By

Published : Aug 21, 2022, 8:42 PM IST

Vijayasanthi On CM KCR ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరిక సందర్బంగా మునుగోడులో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్‌ ఎనిమిదేళ్లలో ఏం చేశారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కొట్లాడతానని ప్రజలను నమ్మించి.. అధికారం వచ్చాక కుటుంబానికే పదవులు ఇచ్చారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఏమైందని విజయశాంతి నిలదీశారు. తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరులను తుంగలోకి తొక్కినందుకు మిమ్మల్ని సమర్థించాలా? అని ప్రశ్నించారు. దళితుడికి 3 ఎకరాల భూమి, ప్రతి పేద కుటుంబానికి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు.

కేసీఆర్‌ ప్రతి ఎన్నికల్లో బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకొస్తారు. బీబీసీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. దయచేసి మోసపోవద్దు. నిన్నటి సభకు రూ.వెయ్యి, మద్యం బాటిల్‌ ఇచ్చి జనాలను తరలించారు. రోజు రోజుకీ కేసీఆర్‌ గ్రాఫ్ పడిపోతోంది. మైండ్‌ గేమ్‌ ఆడుతూ భాజపాలోని నాయకులను విడదీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్ని మైండ్‌గేమ్‌లు ఆడినా భాజపా నేతలను విడదీయలేరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం’.

- విజయశాంతి, మాజీ ఎంపీ, భాజపా నేత

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నానని.. వేల కోట్లు అప్పులు తీసుకున్ని ఆ డబ్బంతా జేబులో వేసుకున్నారని విజయశాంతి ఆరోపించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు కనీస వసతులు కల్పించాలని ఉద్యమం చేస్తే వారిని కూడా మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నందుకు మిమ్మల్ని సమర్థించాలా? అని సీఎ కేసీఆర్​ను ప్రశ్నించారు.

కేసీఆర్‌ బీబీసీ తీసుకుని మోసపోవద్దన్న విజయశాంతి

కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని విజయశాంతి ఎద్దేవా చేశారు. మోదీ ఆయనకు శత్రువే కానీ, మోదీ ప్రజలకు మాత్రం మంచి మిత్రుడన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయం లేనప్పుడు పదే పదే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పే మాయ మాటలకు ప్రజలు మోస పోయి గెలిపిస్తున్నారని ఆమె అన్నారు. నిన్నటి వరకు ప్రత్యామ్నాయ పార్టీ లేదని.. అందుకే కేసీఆర్‌ చేసిన అవినీతిని భరించారని విమర్శించారు. కానీ, ఇవాళ భాజపా ప్రత్యామ్నాయంగా వచ్చేసిందని.. అందరూ భాజపాను అధికారంలోకి తీసుకురావాలని విజయశాంతి కోరారు.

ఇవీ చదవండి:కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇది ప్రారంభమన్న అమిత్​ షా

సీఎం కాన్వాయ్​పై దాడి, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details