నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మెట్ట పద్ధతిలో వ్యవసాయం రైతులను లాభాల బాట పట్టిస్తోంది. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిలో భూమి చదును చేసి తొలకరి ప్రారంభం తర్వాత ట్రాక్టర్ వెనుక మల్టి క్రాప్ ప్లాంటర్ యంత్రం సాయంతో భూమిలో విత్తనాలు వేసి వరిని పండిస్తారు. ఫలితంగా కూలీల ఖర్చు సహా ఇతరత్రా వ్యయాలు భారీగా తగ్గుతున్నాయి. అంతేకాదు ఎలాంటి రసాయనాలు వాడాలనే విషయంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో త్రిపురారం మండలంలో 380 ఎకరాల్లో సాగు చేశారు. మంచి ఫలితాలు రావడంతో పది మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో మెట్ట పద్ధతిలో సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతులు, భూముల ఎంపిక, విత్తనాల సరఫరాను పూర్తి చేశారు.
మెుదట్లో కొంతమంది రైతులే..: ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సభ్యులు మెట్ట పద్ధతిలో వరి సాగును ప్రోత్సహిస్తున్నారు. మెుదట్లో కొంతమంది రైతులే ముందుకు వచ్చారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్లు అదనపు దిగుబడులు రావడంతో.. ఈ ఏడాది చాలా మంది రైతులు ముందుకు వచ్చారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ దఫా ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగువుతున్న దృష్ట్యా.. ఐఆర్ఆర్ఐలో శిక్షణ పొందిన ప్రతినిధులు... రైతులకు సలహాలు ఇచ్చేందుకు రెండు నెలలపాటు క్షేత్రస్థాయిలోనే గడపనున్నారు. విత్తనాలు చల్లే మల్టీక్రాప్ ప్లాంటర్‌ను గ్రామానికి ఒకటి చొప్పున పంపి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ తెలిపారు.