Young Man Committed Suicide in Nalgonda: తనపై ఓ యువతి ఫిర్యాదు చేయడం, పోలీసులు తీసుకెళ్లి విచారణ చేయడంతో ఆందోళనకు గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు అతని మృతదేహంతో యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపైనా వారు తిరగబడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలం తాస్కానిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తన కుమార్తె(17)ను అబ్బనబోయిన శివ (26) ప్రేమ పేరిట వేధిస్తున్నాడంటూ తాస్కానిగూడేనికి చెందిన ఓ మహిళ ఈ నెల 7వ తేదీన నల్గొండ జిల్లాలో షీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు.
Young Man Commit Suicide: ఆమె ఇచ్చిన సమాచారంతో విచారణ కోసం.. శివను ఈ నెల 10న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి షీ టీమ్ సీఐ రాజశేఖర్ కౌన్సిలింగ్ చేసి, అదే రోజు సాయంత్రానికి వదిలేశారు. దీంతో మనస్తాపానకి గురైన శివ ఈ నెల 11న ఇంట్లో పురుగు మందు తాగాడు. ఇది గమనించిన అతని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శుక్రవారం మధ్యాహ్నం అతను మృతి చెందాడు. పోస్ట్‌మార్టం అనంతరం.. మృతదేహాన్ని శనివారం సాయంత్రం పోలీసు బందోబస్తు మధ్య అంబులెన్స్‌లో అతని స్వగ్రామానికి తీసుకొచ్చారు.
పోలీసులపై కారం చల్లడంతో పరిస్థితి ఉద్రిక్తం: అయితే మృతదేహాన్ని యువతి ఇంటి ఆవరణలో ఉంచి ఆందోళన చేపట్టేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో కొందరు పోలీసులపై కారం చల్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో వారు శివ మృతదేహాన్ని యువతి ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ పేరుతో పిలిపించిన సీఐ రాజశేఖర్ విచక్షణా రహితంగా కరెంట్ షాక్ ఇచ్చి చితకబాదారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.