మీ పిల్లలకు ఇలాంటి భోజనాలు పెడతారా? ఏం తమాషాగా ఉందా.. ? అని బీసీ గురుకుల సిబ్బందిపై నాగర్ కర్నూలు జడ్పీ ఛైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి మండిపడ్డారు. ప్రభుత్వ కళాశాల్లో పేద విద్యార్థులంటే తమాషాగా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ జ్యోతిరావు పూలే మహిళా గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఛైర్‌పర్సన్ పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలా తింటారు?..
వంటశాల, తరగతి గదులు, మరుగుదొడ్లు, నిల్వ ఉంచిన బియ్యం, పప్పు ధాన్యాలు, కూరగాయలు పరిశీలించారు. సరిగ్గా ఉడకని అన్నం పెట్టడం బాగాలేదని, అది విద్యార్థులు ఎలా తింటారని వంటవాళ్లపై అసహనం వ్యక్తం చేశారు.