హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల వేగం.. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని(Amrabad tiger reserve forest) వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారుతోంది. మన్ననూరు చెక్ పోస్టు నుంచి దోమలపెంట వరకు జాతీయ రహదారి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది. ఈ మార్గంలో నిత్యం వందలాది బస్సులు, కార్లు, లారీలు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. అడవుల్లో సంచరించే చిరుతలు, పులులు, కోతులు, పాములు, అడవి పందులు, పక్షులు, ఉడుములు, జింకలు తదితర జంతువులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఆహారం, నీళ్ల కోసం రోడ్డుదాటే క్రమంలో వాహనాల టైర్ల కింద నలిగి ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఇదీ చదవండి: కెమెరాకు చిక్కకుండా.. అధికారులే ఆశ్చర్యపడేలా..!
ఎక్కువగా కోతులే..
రోడ్డు ప్రమాదాల్లో ఎన్ని వన్య ప్రాణులు(Nallamala forest animals) మృత్యువాత పడుతున్నాయన్న దానిపై అటవీశాఖ గణాంకాలు నమోదు చేస్తోంది. 2017 నుంచి 2021 వరకూ సుమారు 200లకు పైగా జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఇందులో అత్యధిక ప్రమాదాలు జరిగింది... అక్టోబర్ మాసంలోనే. చనిపోయిన జంతువుల్లో అధికశాతం కోతులు కాగా, కట్లపాములు, మన్నుతినే పాములు, చుక్కల దుప్పులు, కొండముచ్చులు, ఉడుములు, రక్త పింజరలు, జింకలు...ఇలా అనేకం ఉన్నాయి.
ఇదీ చదవండి: నల్లమల అడవుల్లో యురేనియం అలజడులు
నిబంధనలు బేఖాతరు
అభయారణ్యంలో వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వ వాహనాలైన ఆర్టీసీ బస్సులు సైతం వేగాన్ని పాటించడం లేదనే విమర్శలున్నాయి. మితిమీరిన వేగం కారణంగా ఎదురుగా వచ్చిన జంతువులను గుర్తించినా నియంత్రించలేని పరిస్థితుల్లో వాహనదారులు జంతువులను ఢీకొట్టి వెళ్లిపోతున్నారు.