మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌లో ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, నిరంజన్‌షావలీ ఉర్సు ఉత్సవాలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు.
ఉమామహేశ్వరంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే హిందువులు... తిరిగి వెళ్లేటప్పుడు నిరంజన్ షా వలీ దర్గాకు వెళ్లి దర్శించుకుంటారు. దర్గాకు వచ్చే ముస్లింలు ఉమామహేశ్వరంలో స్వామి వారిని దర్శించుకుని, బ్రహ్మోత్సవాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
గ్రామానికి వచ్చే భక్తుల కోసం కుల, మత, వర్గ, వర్ణ విబేధాలు లేకుండా అంతా తగిన సాయం చేస్తూ..తమ ఔదార్యాన్ని, ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. 700 ఏళ్ల కిందట ఇరాక్ నుంచి వచ్చిన మత ప్రచారకుల్లో ఒకరు నిరంజన్ షా వలీ. రంగాపూర్ గ్రామంలో స్థిరపడి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ అక్కడే కాలం చేశారు. ఆయన సమాధి వద్దే ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు ఫతేహలు సమర్పించి, కందూర్ నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు.
శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పేరొందిన ఉమా మహేశ్వర బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తారు. పచ్చని కొండలు, కనువిందు చేసే జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. స్వామి వారి సేవలో తరిస్తారు. మొత్తంగా ఆధ్యాత్మికతకు, మత సామర్యానికి, కుల,మత, వర్గ, వర్ణ విబేధాలు లేని మానవాళి ఐక్యతకు రంగాపూర్ జాతర వేదికగా నిలుస్తోంది.
జాతరకు వేలాది మంది భక్తులు వస్తుండటం వల్ల రవాణా, మంచినీరు, ఆరోగ్య శిబిరాలు, పోలీసు బందోబస్తును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.