తెలంగాణ

telangana

ETV Bharat / state

దాహం తీర్చండి మహాప్రభో!.. అమ్రాబాద్​ అడవుల్లో చెంచుల నీటి గోస.. - ts news

Tribals Strugle for Water: కనుచూపు మేరల్లో దట్టమైన అడవి. మాడు పగిలేలా మండే ఎండలు. ఒంట్లో ఓపికతోపాటు నీళ్లను పీల్చేసే ఉష్ణోగ్రతలు. తాగేందుకు మంచి నీరుండదు. కిలోమీటర్లు నడిచినా ఫలితం ఉండదు. చేసేదిలేక చెలిమెల్లో, బావుల్లో దొరికే గుక్కెడు నీటి కోసమే వారి ఆరాటం. వేసవి వేళ నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అడవుల్లో చెంచుల నీటి గోస.. వర్ణణాతీతంగా మారింది.

దాహం తీర్చండి మహాప్రభో!.. అమ్రాబాద్​ అడవుల్లో చెంచుల నీటి గోస..
దాహం తీర్చండి మహాప్రభో!.. అమ్రాబాద్​ అడవుల్లో చెంచుల నీటి గోస..

By

Published : Mar 24, 2022, 7:49 PM IST

దాహం తీర్చండి మహాప్రభో!.. అమ్రాబాద్​ అడవుల్లో చెంచుల నీటి గోస..

Tribals Strugle for Water:నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లోని చెంచుగ్రామాలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేసవి తీవ్రరూపం దాల్చుతుండటంతో.. అటవీ ప్రాంతాల్లోని చెంచుగ్రామాల ప్రజలు అరిగోస పడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని 88 చెంచు గ్రామాల్లో 2వేల 6 వందల కుటుంబాలు నివాసముంటున్నాయి. అటవీ ప్రాంతం కావటంతో అరకొర సౌకర్యాలతోనే జీవితాలు నెట్టుకొస్తున్న వీరు.. నీటి సమస్యతో బతకటమే కష్టంగా మారింది. సమస్యలను చూసి చలించిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌ స్వచ్ఛంద సంస్థ.. పలుచోట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది.

నీటి సమస్య ఎక్కువగా ఉంది..

మా ఊళ్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. వర్షాలు పడేవరకు మాకు నీటి సమస్య ఉంటనే ఉంటది. ఇంతకు ముందు మిషన్​భగీరథ పైపుల ద్వారా నీళ్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పైపులు నడుస్తలేవు. కొద్ది రోజుల పాటు మంచి ఆర్డీటీ నుంచి ట్యాంకరు పంపించేవాళ్లు. అది కూడా రోజు మార్చి రోజు వస్తుంది. మాకు స్నానాలు చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఆ వాగులో నీళ్లు పారవు.. అలాగే నిల్వ ఉంటాయి. ఈ ఎండాకాలం ఆ నీళ్లు పచ్చగా ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో అక్కడే బట్టలు ఉతుక్కుని స్నానం చేయాల్సి వస్తోంది. -గిరిజన మహిళ

మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా..

అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతాల్లోని కనిమెట్ట, కొల్లంపెంట, కుడి చింతలబైలు, ఫర్హాబాద్‌, మల్లాపూర్, లింగాల మండలాల గిరిజన వాసులను నీటి సమస్య మరింత వేధిస్తోంది. ప్రభుత్వం సౌర వ్యవస్థ ద్వారా బోర్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం అవి పనిచేసే స్థితిలో లేవు. మరమ్మతులకు నోచుకోక చాలాచోట్ల నిరుపయోగంగా మారాయి. దీంతో అటవీ ప్రాంతాల్లోని వాగులు, బావులు, చెలిమెల్లో నీటిని తెచ్చుకుంటూ.. దప్పిక తీర్చుకుంటున్నారు.

నీటి సమస్య తీర్చాలి..

నీటి సమస్య కారణంగా ఇప్పటికే చాలామంది అటవీ ప్రాంతాల్లోని ప్రజలు కృష్ణానది పరివాహక ప్రాంతానికి వలస వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తమ ప్రాంతాలకు నీటి సరఫరా వీలు కాని పక్షంలో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దప్పిక తీర్చాలని చెంచులు కోరుతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని చెంచులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details