Mangoes Trading: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా మామిడి సాగయ్యే జిల్లా నాగర్‌కర్నూల్. కొల్లాపూర్, కల్వకుర్తి, వెల్దండ సహా పలు మండలాల్లో వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పండిన పంటను రైతులు అమ్ముకోవాలంటే దళారులను ఆశ్రయించాలి. లేదా హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకోవాలి. ఈ విధానంలో రైతులకు మిగిలే లాభం తక్కువ. రైతులకు లాభం చేకూర్చడంతోపాటు.. మహిళా సంఘాలకూ ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీలు పెద్దకొత్తపల్లి, వెల్దండ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో.. రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసి లాభాలు పొందుతున్నాయి.
2019లో పెద్దకొత్తపల్లిలో మహిళలు 'ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనేషన్'(ఎఫ్‌పీఓ)గా ఏర్పడ్డారు. ఒక్కో సభ్యురాలు 500 వాటాదనం, 100 రూపాయలు సభ్యత్వం చెల్లించి కంపెనీలో సభ్యులుగా చేరారు. వీరికి డీఆర్డీఏ, సెర్ప్ జాతీయ జీవనోపాధుల పథకం కింద.. ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతోంది. కంపెనీలో సభ్యులుగా ఉన్నవారు.. రైతుల తోటల్లోనే పంట కొనుగోలు చేస్తారు. కాయల్నితెంపడం, గ్రేడింగ్, ప్యాకింగ్ కంపెనీ ద్వారా చేపడతారు. అందుకోసం మహిళా సంఘాలకు, రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. తోటల్లోంచి కాయల్ని వాళ్లే రవాణా చేస్తారు. ఏ గ్రేడ్ రకాన్ని గుజరాత్, ముంబయి, దిల్లీ లాంటి ఇతర ప్రాంతాలకు ఎగుమతి కోసం.. బి గ్రేడ్ రకాన్ని స్థానికంగా మాగబెట్టి పండ్లు చేసి అమ్మడం కోసం కొనుగోలు చేస్తారు. నాణ్యమైన కాయల్నే సేకరించడం వల్ల రైతులకు మంచి ధర పలుకుతుంది.
'మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా సంఘాల ద్వారానే మంచి లాభాలు పొందుతున్నాం. ఇప్పటివరకూ 8 టన్నులు అమ్మాం. రూ. 4 లక్షలు లాభాలు వచ్చాయి. మార్కెట్‌కు మేమే స్వయంగా తీసుకెళ్తే.. గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం లేదు. దళారుల దోపిడీ ఎక్కువగా ఉండేది. పంట అమ్ముకోవడం గగనంగా మారేది.' -లచ్వమ్మ, రైతు
'గతేడాది ఎఫ్పీఓను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 433 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మూడు గ్రామాల నుంచి 42 మెట్రిక్ టన్నుల మామిడి సేకరించాం. రూ. 22 లక్షలు వచ్చాయి. కంపెనీ ఆదాయం చూసుకొని రైతుల గిట్టుబాటు ధర చెల్లిస్తాం.' -రాజేశ్వరి, ఎఫ్‌పీఓ ఛైర్‌పర్సన్
రైతుల నుంచి నేరుగా మామిడిని కొనుగోలు చేసి బేనిషాన్ లాంటి కంపెనీలకు అమ్మడం ద్వారా.. మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘాలు మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి. ఎఫ్‌పీఓ ద్వారా లాభం ఉండటంతో... ఎక్కువ మంది కంపెనీలో చేరేందుకు.. ఉత్సాహం చూపుతున్నారని... రానున్న రోజుల్లో ఎగుమతుల్ని మరింత పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.