తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలనే నిర్ణయం జగన్ అన్నది కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడి ప్రజల ఓట్ల చీలిక కోసమే రాష్ట్రంలో మరో కుట్ర జరుగుతోందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ జెండా పాతాలంటే పోతిరెడ్డిపాడు, సంగంబండ, కృష్ణా జలాలపై వారి వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డగా వస్తే అపురూపంగా చూసుకుంటామని... ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తే ఎదురు తిరుగుతామన్నారు.
పోతిరెడ్డిపాడు, కృష్ణా జలాల మీద న్యాయస్థానాల్లో వేసిన కేసులను ఏపీ సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని రేవంత్ అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన వారు ఇక్కడ పార్టీ పెడతా అంటే ఎవరూ ఆదరించరని పేర్కొన్నారు. షర్మిలమ్మ పార్టీ పెడతానంటే కేసీఆర్ నోరు మెదపకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని సూచించారు.