కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అధికారులు సమన్వయంతో అమలుపరిచి.. నాగర్ కర్నూల్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఎంపీ పి. రాములు అధ్యక్షత వహించిన దిశా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శాఖల వారీగా సమీక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో క్షేత్ర స్థాయిలో అమలయ్యే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కమిటీ సమావేశం ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించాల్సి ఉంటుందని.. కానీ కరోనా కారణంగా ఈసారి ఆలస్యమైందని తెలిపారు. మొత్తం 22 శాఖల ద్వారా నిర్వహిస్తున్న 43 కేంద్ర పథకాలపై శాఖల వారీగా సమీక్షించారు.
జిల్లాలో భూసార కేంద్రం...
తెలంగాణ రాష్ట్రం పంట ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. అధిక మొత్తంలో పత్తి, వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సాగు చేసే విధంగా రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని వివరించారు. జిల్లాలో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపిన ఆయన.. ఉపాధి హామీ పని దినాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి బడుల్లో చేర్పించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 433 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సమావేశంలో జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ ఎల్. శర్మన్ చౌహన్, అదనపు కలెక్టర్ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ