Minister Harish Rao Nagarkurnool District Tour : గత ప్రభుత్వాలు కరవులు, వలసలు మాత్రమే ఇచ్చాయని.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో రూ.3 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జడ్పీ ఛైర్పర్సన్ శాంతకుమారితో కలిసి శంకుస్థాపన చేశారు. మజీదు, దేవాలయం కాంపౌండ్ వాల్, బస్టాండ్ తదితర అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.
కరవు జిల్లాగా చేశారు..:ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు జిల్లాను వలసల జిల్లాగా, కరవు జిల్లాగా చేశాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చదనం, నీళ్లతో కళకళలాడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు పరుస్తున్నామని వివరించారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పేద వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని ఆయన చెప్పారు.
ప్రజల కోసం పథకాలు..:కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇబ్బంది రాకూడదని కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభించారని మంత్రి చెప్పుకొచ్చారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామని.. తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటుందని 4 నెలలకు ఒకసారి, 7వ నెలలో ఒకసారి న్యూట్రిషన్ కిట్‌ను అందజేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శలు చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇచ్చింది ఒకటి కరవు... రెండు వలసలు అని విమర్శలు గుప్పించారు.
"కాంగ్రెస్ హయాంలో ఎరువు బస్తాలు కావాలంటే గంటల తరబడి లైన్లలో నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి. కరెంట్ కోసం కళ్లలో వత్తులు వేసుకొని చూసేవాళ్లం. తాగునీటి కోసం రెక్కలన్నీ నొప్పులొచ్చేలా బోరింగులు కొట్టేవాళ్లం.ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. ప్రజల కోసం రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి.. ఇలా ఎన్నో రకాల పథకాలతో ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమవుతాయి. జిల్లాకు కృష్ణానది నీళ్లు అంది.. రెండు పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది." _మంత్రి హరీశ్ రావు
Harish Rao Nagarkurnool Tour : 'కరవులు, వలసలు తప్ప గత ప్రభుత్వాలు ఏమీ ఇవ్వలేదు'
యుద్ద భేరి కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు..: కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న చట్టాలను.. కేంద్రం కాలరాస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. కేంద్రంపై కార్మికుల తరపున పోరాటం చేసేందుకు యుద్ధ భేరి మోగిస్తున్నామన్న ఆయన.. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో.. బుధవారం జరగనున్న యుద్దభేరి కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరవుతారని స్పష్టం చేశారు. కార్మికులను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్న ఆయన.. వారి సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. కార్మికులతో కలిసి ఆటో నడుపుతూ.. యుద్ధ భేరి ప్రచారం నిర్వహించారు.