నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెతెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పాల్గొని.. మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ హామీలను మర్చిపోయారని ఎల్.రమణ విమర్శించారు. కరోనా కారణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటనలు అంటూ హడావిడి మొదలుపెట్టారని మండిపడ్డారు.