భూ సమస్య పరిష్కరించాలని వేడుకున్న రైతుతో తహసీల్దార్ అమానుషంగా ప్రవర్తించిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో చోటుచేసుకుంది. దారారం గ్రామానికి చెందిన కొండల్ అనే రైతు సర్వే నంబర్ 1067లో ఉన్న తన తండ్రి వెంకటయ్య పేరు మీదున్న 6 ఎకరాల భూమిని తనపేరు మీద పట్టా చేయాలని తహసీల్దార్ మల్లికార్జున్ రావును కోరారు. కొన్ని నెలలుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా.. ఇంత వరకు తన సమస్య పరిష్కరించలేదని రైతు కొండల్ తెలిపారు.
భూ సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ కారు అడ్డగించిన రైతు
భూ సమస్యను పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రైతుకు తహసీల్దార్ వాహనం తగలటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భూ సమస్య పరిష్కరించమని వెళితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంపై ఎమ్మార్వో మల్లికార్జున్ రావును కొండల్ నిలదీయగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన సమస్య పరిష్కరించిన తర్వాతే అక్కణ్నుంచి వెళ్లాలని ఎమ్మార్వో కారును అడ్డగించాడు. రైతు గోడును పట్టించుకోని తహసీల్దార్ కారు పోనివ్వడం వల్ల అడ్డుగా వచ్చిన రైతు కొండల్ వాహనం తగిలి కింద పడిపోయాడు. అది పట్టించుకోకుండా మల్లికార్జున్ రావు అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
స్వల్ప గాయాలతో రైతు కొండల్ తహసీల్దార్ కార్యాలయం వల్ల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దృష్టికి తీసుకెళ్లారు. కొండల్ భూమి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వో మల్లికార్జున రావును ఎమ్మెల్యే ఆదేశించారు. అక్కడికి చేరుకున్న అచ్చంపేట ఆర్డీఓ పాండునాయక్ విచారణ చేపట్టారు.
- ఇదీ చదవండి:ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య!
TAGGED:
clash between MRO and farmer